రాష్ట్రంలో వర్షాలు తగ్గిపోయాయి. గత ఐదు రోజులు బీభత్సం సృష్టించిన వరణుడు కాస్త శాంతించాడు. కానీ పూర్తిగా వర్షాలు మాత్రం తగ్గిపోలేదని హైదరాబాద్ వాతవరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ కొద్ది ప్రాంతాల్లో స్వల్పంగా జల్లులు తప్ప వర్షాలు పడలేదు.
బుధవారం నుంచి 5 రోజుల పాటు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు తెలంగాణలోకి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉష్ణోగ్రత సాధారణంకన్నా 2 నుంచి 6 డిగ్రీల వరకూ తక్కువగా ఉంది. నల్గొండ, ఖమ్మం మినహా మిగిలిన ప్రాంతాల్లో గాలిలో తేమ సాధారణంకన్నా ఎక్కువగా ఉంది.
గత రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఇప్పటివరకు భాగ్యనగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భారీ వరదకు నాలాల నుంచి కొట్టుకొచ్చిన చెత్త అంతా పలు రహదారులపై పేరుకుపోయి ఉంది. దాన్ని తొలగించే పనిలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిమగ్నమయ్యారు.