తెలంగాణ ఉపసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళ్ సాయి చేసిన ప్రసంగం పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన ఇవాళ మాట్లాడారు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం సరికాదన్నారు. ఆమె స్థాయికి తగదని.. అసెంబ్లీలో గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరమన్నారు కడియం. 2014 లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తం అయ్యిందని ఇప్పుడు కావడం ఏమిటోనని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టుగా ఉందని సెటైర్ వేశారు.
10 ఏళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని విస్మరించారని.. తిరోగమన దిశలో తెలంగాణ ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధికి ఎంచుకున్న మార్గం ఏమిటో గవర్నర్ చెప్పలేదని.. ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆర్ గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పలేదని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో దళిత బంధు ప్రస్తావననే లేదని.. రైతుల పంటలకు బోనస్ ఇస్తామన్న హామీ గురించి మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ హామీల గురించి పలాయన వాదం పాటించే విధంగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు కడియం శ్రీహరి.