తెలంగాణలో 1.5 లక్షల మంది HIV రోగులు, 3 వేల మంది మృతి !

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల మంది హెచ్ఐవి పాజిటివ్ రోగులు ఉన్నారు. వీరిలో 90,000 మంది మాత్రమే మందులు తీసుకుంటున్నారు. మిగతా వారు ఎక్కడ ఉన్నారనే విషయం తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ అధికారులకే తెలియదు. వీరిలో ఎక్కువ శాతం గ్రామీణులే. అందులోను డ్రైవర్లు, మెకానిక్ లు, కార్మికులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరట నిచ్చే అంశం. 2015 లో 0.66 శాతం బాధితులు నమోదు కాగా, 2020-21 లో 0.47 శాతానికి తగ్గిందని అధికారులు వెల్లడించారు. బుధవారం కోఠి లోని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ప్రాజెక్టు ఆదనపు సంచాలకురాలు డాక్టర్. జి.అనంత ప్రసన్న కుమారి, ఉప సంచాలకులు జి. వెంకటేశ్వర్ రెడ్డి, సంయుక్త సంచాలకులు డాక్టర్లు మురళీధర్, రవికుమార్, పరిపాలన విభాగాధికారి ప్రవీణ్ కుమార్ ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన కోసం రూపొందించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు.