మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఎక్కువగా వినిపించే సమాధానం బిర్యానీ. ఎన్ని రుచులు అందుబాటులో ఉన్నా.. వావ్ అనిపించేది బిర్యానీయే. బిర్యానీకి డిమాండ్ ఎప్పుడూ ఎక్కువే. కానీ రంజాన్ మాసంలో మాత్రం హలీం డామినేట్ చేస్తుంది బిర్యానీని. హలీం కోసం ఈ మాసంలో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తుంటారు ఫుడ్ లవర్స్. హలీంకు ఉన్న డిమాండ్ వల్ల రంజాన్ సీజన్‌లో బిర్యానీ విక్రయాలు తగ్గుతుంటాయి.
అయితే ఈ ఏడాది మాత్రం సీన్ రివర్స్ అయింది. పండగ ఏదైనా, ఏ కాలంలోనైనా బిర్యానీకే జై కొడతామని నిరూపించారు. స్విగ్గీ సంస్థకు రంజాన్ నెలలో వచ్చిన ఆర్డర్లే అందుకు నిదర్శనం. ‘ఈ నెలలో సుమారు 10 లక్షల బిర్యానీలను నగరవాసులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చారు. గత ఏడాది కంటే ఇది 20 శాతం అధికం’ అని ఆ సంస్థ తాజాగా వెల్లడించింది. హలీంకు నెల రోజుల్లో 4 లక్షల ఆర్డర్లు వచ్చినట్టు పేర్కొంది.