సికింద్రాబాద్ అల్లర్ల కేసులో మరో 13 మంది విడుదల

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో 13మంది నిందితులు బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ఆవుల సుబ్బారావుతోపాటు మరో 28మంది విడుదలయ్యారు. అభ్యర్థులు విడుదలవుతున్నందున వారి వారి కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున జైలువద్దకు చేరుకున్నారు. జూన్‌ 17న అగ్నిపథ్​కు వ్యతిరేకంగా ఆర్మీ నియామక పరీక్ష రాసిన అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అందోళన చేపట్టి విధ్వంసానికి పాల్పడ్డారు.

అసలేం జరిగిందంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కనీవినీ ఎరగని రీతిలో విధ్వంసం చెలరేగింది. ఆర్మీ అభ్యర్థులంతా రైల్వే స్టేషన్​లో దమనకాండ సృష్టించారు. ఒక్కసారిగా దూసుకువచ్చిన వేలమంది ఆర్మీ ఆశావహులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. 8 రైళ్లకు చెందిన బోగీలను తగులబెట్టారు. షాపులను లూటీ చేశారు. ఆర్టీసీ బస్సులపైనా దాడిచేశారు. పక్కా పథకం ప్రకారం జరిగిన ఆ దమనకాండను ఆపేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.. పలువురికి బుల్లెట్లు తాకి గాయాలయ్యాయి.