కేంద్ర సర్కార్ తెలంగాణకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి 13 కొత్త వైద్య కళాశాలలకు అనుమతినిచ్చింది. ఈ మేరకు జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) వెల్లడించింది. 2023-24 విద్యా సంవత్సరానికి దేశం మొత్తమ్మీద 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చినట్లు ఎన్‌ఎంసీ తెలిపింది.
దేశంలో 6,200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానుండగా తెలంగాణలో 1500, ఆంధ్రప్రదేశ్‌లో 750 సీట్లు పెరగనున్నాయని ఎన్‌ఎంసీ తెలిపింది. తెలంగాణలో ప్రారంభం కానున్న వైద్య కళాశాలల్లో 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు కాగా 4 ప్రైవేటువి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి ఆసిఫాబాద్, వికారాబాద్, భూపాలపల్లి, జనగామ, సిరిసిల్ల, నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ వైద్య కళాశాలల్లో ఒక్కో దాంట్లో 100 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 900 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.
అదేవిధంగా సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అరుంధతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నీలిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలకు అనుమతి రాగా ఒక్కో కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున 600 సీట్లు మంజూరయ్యాయి.