రెండు నెలల పాటు 15 కిలోల ఉచిత బియ్యం

-

క‌రోనా సంక్షోభంలో పేదలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రానున్న రెండు నెలల పాటు (జూన్, జూలై)పేదలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలానే ప్ర‌తీ వ్య‌క్తికి 15 కిలోల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నయోజన పథకం ద్వారా రెండు నెలల పాటు ఉచితంగా పది కిలోల బియ్యం పంపిణీ చేస్తుండగా… దీనికి రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోలు కలిపి పంపిణీ చేయనుంది. అంత్యోద‌య అన్న‌యోజ‌న కార్డు దారుల‌కు 35 కేజీల‌కు అదనంగా మ‌రో ప‌దికిలోలు, అలానే అన్న‌పూర్ణ కార్డుదారుల‌కు అందించే ప‌ది కిలోల‌కు కూడా అద‌నంగా మరో ప‌దికిలోలు అందించ‌నున్నారు.

ఇక ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి ఆదివారం ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. దీంతో పౌర సరఫరా శాఖ అధికారులు బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 87,42,590 కార్డులకు 4 లక్షల 31 వేల మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యం సరఫరా చేయనున్నారు. దీని ద్వారా మొత్తం 2,79,24,300 మందికి లబ్ది చేకూరనుంది.

Read more RELATED
Recommended to you

Latest news