4 పార్టీలు మారిన వ్యక్తి నాపై నిందలు వేస్తున్నాడు – రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి తనపై నిందలు వేస్తున్నాడని మండిపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని కానీ ఎక్కడా విమర్శించని చెప్పానని.. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీని బలిదేవత అన్న మాట వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు.

ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు పథకం ప్రకారమే డబ్బులతో పిసిసి పదవిని కొనుక్కున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి తనలా ధైర్యంగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లెటర్ ఇవ్వకుండా చంద్రబాబుకి ఇచ్చారని దుయ్యబట్టారు. ఉప ఎన్నికలకు భయపడే రాజీనామా నాటకం చేశాడని అన్నారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి తనపై నిందలు వేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. రేవంత్ రెడ్డి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తాడని ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడి ముసుగులో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించాడని ఆరోపించారు.