తెలంగాణలో 2023-24 యాసంగి సీజన్ కోసం ఈనెల 29వ తేదీ వరకు 64,75,819 (92.68) శాతం మందికి రైతుబంధు నిధులను విడుదల చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క సంవత్సరం రైతు బంధు నిధులనూ 3 నెలల కంటే తక్కువ రోజుల్లోనే జమ చేయలేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినా రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ప్రస్తుత 2023-2024 సంవత్సరంలో వర్షపాతం లోటు ఏర్పడిందని, ఫలితంగా సాగునీటి రిజర్వాయర్లలో, చెరువుల్లో నీరు తగ్గుతోందని మంత్రి తుమ్మల అన్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోరు బావులు ఎండిపోతున్నాయని, సాగు నీరందక కొన్ని జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించే బాధ్యతను వ్యవసాయ శాఖకు వేగంగా అప్పగించామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.