విజయవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. ఉదయం వేళలో అక్కడి పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. మద్యం తాగిన యాచకులు, బ్లేడ్ బ్యాచ్ బస్టాండ్ లోని బెంచీలను ఆక్రమించుకుని నిద్రించారు.ప్రయాణికుల కంప్లెంట్ తో వాళ్లని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారిని నిద్ర లేపడానికి ప్రయత్నించగా పోలీసులపై ఈ ముఠాలు దాడికి దిగారు. దాడి చేసేందుకు ఒక్కసారిగా సుమారు వంద మందికి పైగా దూసుకొచ్చారు.
బేడతో దాడికి యత్నించడంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరుగులు పెట్టారు. ఈ ఘటనలో సాంబయ్య అనే ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అదనపు పోలీసుల రాకతో నిందితులు పరారయ్యారు.దాడికి పాల్పడిన వారిలో కొందరిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైల్వే స్టేషన్ లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ ను రానివ్వకపోవడం తో వారంతా బస్టాండ్ కు వస్తున్నారు. అక్కడి నుంచి తమను బయటకు పంపడాన్ని నిరసిస్తూ వాళ్లు దాడికి దిగారు.