ఆదిత్యానాథ్ దాస్ ని తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆదేశిస్తున్నాడు.. శిష్యుడు రేవంత్ పాటిస్తున్నాడని అన్నాడు. ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తనం మొదలయిందనడానికి ఈ నియామకమే నిదర్శనమని తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణకు రుణపడి ఉంటాడా? పదవిని లాగేస్తారన్న భయంతో చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటాడా? అని ప్రశ్నించాడు.
నాడు జలయజ్ఞం ప్రాజెక్టుల నుంచి నిన్న పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యాదాస్ ది కీలకపాత్ర అని పేర్కొన్నారు. ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తికి తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి ఎందుకు కట్టబెట్టారో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరాడు.