నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీచేశారు.
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…. ‘‘ తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు భారత సామాజిక దార్శనికుడు మహామేధావి డా. బిఆర్ .అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన రాష్ట్రం ఏర్పాటయిన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక డా. బిఆర్ అంబేద్కర్ మహాశయుని ఆశయాలు ఇమిడి వున్నవి.
డా. బిఆర్ అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డా. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని అమలు చేస్తున్నది అని పేర్కొన్నారు.