ఎన్నికలు సమీపిస్తున్నందున శాంతి భద్రతల పరిరక్షణకై మరింత అప్రమత్తంగా ఉండాలి – డీజీపీ

-

హైదరాబాద్: నగరంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద చారిత్రక 125 అడుగుల డా. బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకై వచ్చిన సి.పి లు, ఎస్.పి లతో డీజీపీ కార్యాలయంలో నేడు సమావేశం నిర్వహించారు. అడిషల్ డీజీ లు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్, విజయ్ కుమార్, షికా గోయల్, సందీప్ శాండిల్య, రాచకొండ సీపీ డి.ఎస్.చౌహాన్, ఐ.జి లు కమలహాసన్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, షా నవాజ్ కాసీం, డీఐజీ రమేష్ రెడ్డి తదితర సీనియర్ పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు, సంస్థలు పాదయాత్రలు, బహిరంగ సభలు అధికంగా నిర్వహిస్తాయని, ఈ సందర్బంగా శాంతి భద్రతల విభాగం, స్పెషల్ బ్రాంచ్ ల పనితీరు అత్యంత కీలకమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతీ బందోబస్తు ప్రతీ సారి ఒక పరీక్షగా ఉంటుందని, ప్రతీసారి ఎదురయ్యే కొత్త సవాళ్లకు అనుగుణంగా సరికొత్త వ్యూహంతో పనిచేయాలని అన్నారు.

రాష్ట్రానికి ఉన్న సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్ లకు చెందిన సరిహద్దు జిల్లాలపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తీవ్రవాద పార్టీల సానుభూతిపరులు, మాజీలు, మిలిటెంట్లపై ప్రత్యేక దృష్టిసాధించాలని చెప్పారు. సామాన్య ప్రజలు, పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో పోలీస్ శాఖ సిబ్బంది, అధికారుల ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏ ప్రాంతంలోనైనా పోలీస్ అధికారులు అమర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తే అది మొత్తం పోలీస్ శాఖకే మచ్చ గా ఉంటుందని హెచ్చరించారు.

పోలీస్ అధికారుల గ్రామాల సందర్శన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోందని, ఈ విధానాన్ని మరింత పటిష్ష్టంగా కొన సాగించాలని ఆదేశించారు. ప్రపంచంతోపాటు మన రాష్ట్రం లోనూ సైబర్ నేరాల పెరుగుదల ఉందని, ఈ సైబర్ నేరాల పట్ల ప్రజలను చైతన్య పర్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అంజనీ కుమార్ పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ అనేది కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితం కాలేదని ఇది గ్రామాలకూ వ్యాపించిందని అన్నారు. ఈ సైబర్ నేరాల నివారణకు కేవలం ప్రజల చైతన్యమే మార్గమని తెలిపారు.

ఇందుకు గాను, రాష్ట్రం లోని ప్రతీ పోలీస్ స్టేషన్లో కనీసం పది మంది పోలీస్ అధికారులకు సైబర్ క్రైమ్ నివారణలో ప్రత్యేక శిక్షణ నివ్వాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా విస్తృతి గణనీయంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో పోలీస్ విభాగాల్లోని సోషల్ మీడియా ను మరింత పటిష్టపర్చుకోవాలని డీజీపీ తెలియచేసారు.

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వల్లమరణాలు అధికంగా ఉన్నాయని, సంబంధిత రోడ్లు, భవనాల శాఖ అధికారులతో కలసి రోడ్డున ప్రమాదాలు జరిగే హాట్ స్పాట్లను గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ఇంజనీరింగ్ చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రస్తుత రంజాన్ పండగ నేపథ్యంలో గోవుల అక్రమ రవాణా జారకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లతో పాటు అన్ని జిల్లాల పోలీస్ అధికారులు ప్రత్యేక నిఘా వహించాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news