బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. బండి సంజయ్ మళ్ళీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చార్మినార్ లోని భాగ్య లక్ష్మి అమ్మవారి గుడి పై ఎవరూ చేయి వేయారని ఆయన అన్నారు. అమ్మవారిని తాము కూడా కొలుస్తామని చెప్పారు. అలాగే చార్మినార్ వద్ద ముస్లింలు నమాజ్ చేస్తారని, అదే ప్రాంతంలో హిందువులు భాగ్యలక్ష్మి అమ్మవారిని మొక్కుతారు అని వీహెచ్ అన్నారు.
చార్మినార్ వద్ద ముస్లింలు ప్రార్థనలకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ స్థానిక నేత రషీద్ ఖాన్ సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారంటూ వార్తలు వచ్చాయని, అయితే ఆయన ఎవరో తమకు తెలియదని, పార్టీలో దీనిపై చర్చించి తెలుసుకుంటామని విహెచ్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ వాళ్లు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని వీహెచ్ అన్నారు. అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కు లేఖ రాస్తానని ఆయన చెప్పారు.