తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి నేటితో నెల ముగిసింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. డిసెంబర్ 07న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నెల రోజుల పాలనపై ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా పాలన అంటే ఏంటో కాంగ్రెస్ అమలు చేసి చూపిస్తోందని కొనియాడారు. రాజకీయం చేయకుండా ప్రజా పాలన చేస్తోందని ప్రశంసించారు. రాబోయే ఐదేళ్లలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టంపై ప్రశంసల వర్షం కురిపించారు. బేషజాలకు పోకుండా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానిని కేంద్ర మంత్రులను కలుస్తున్నాడని పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజల కోసం రేవంత్ రెడ్డి రోజు 20 గంటలు కష్టపడుతున్నాడని ప్రశంసించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి దేశమంతా మాట్లాడుకుంటుందని తెలిపారు బండ్ల గణేష్.