రాష్ట్రంలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల రాజకీయం షురూ అయింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే మొన్నటి దాకా వెనకబడి ఉన్న కాంగ్రెస్‌లో ఇప్పుడు కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకుంటూ పార్టీ తన కేడర్‌ను బలోపేతం చేసుకుంటోంది. మరోవైపు ఇన్నాళ్లూ.. కాంగ్రెస్‌పై పై చేయి సాధించిన బీజేపీ మాత్రం కొన్నాళ్లుగా డీలా పడిపోయింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధిష్ఠానం రాష్ట్ర ఇంఛార్జ్‌ను మార్చింది.
కొత్త ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రణాళిక వేస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా.. రెండు పడక గదుల ఇళ్ల స్కీమ్‌పై బీజేపీ ఫోకస్ పెట్టింది.
పేదలకు రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేయాలంటూ బీజేపీ పోరాటాన్ని మరింత ముమ్మరం చేసింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. గద్వాల్‌లో డీకే అరుణ.. హనుమకొండ కలెక్టరేట్ ముందు ధర్నాలో ఈటల రాజేందర్.. జగిత్యాల కలెక్టరేట్ ముందు.. ఎంపీ అర్వింద్ ధర్నాకు దిగనున్నారు. పేదలకు పక్కా ఇళ్లు కేటాయించాలంటూ రేపు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేయనున్నారు. మరోవైపు పేదలకు వెంటనే ఇళ్లు పంపిణి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.