రేపు(జులై-24) మంత్రి కేటీఆర్ 47వ పుట్టినరోజు. ప్రతి ఏడాది ఆయన గిఫ్ట్ ఎ స్మైల్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సమాజానికి ఏదో ఒక మంచి పని చేయాలని పరితపిస్తారు. ఏ పని చేసినా పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని తాపత్రయ పడుతుంటారు. అలా ఎంతో ఉదార స్వభావంతో ఆలోచించే కేటీఆర్.. రేపు నిర్వహించుకోబోయే తన పుట్టిన రోజును కూడా వినూత్నంగా నిర్వహించాలని నిర్ణయించారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడలో నడుస్తున్న స్టేట్ హోంలోని అనాథ పిల్లలకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన 47వ పుట్టిన రోజు సందర్భంగా.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 10, 12వ తరగతుల్లో ప్రతిభావంతులైన 47 మంది పిల్లలకు, ప్రొఫెషనల్ కోర్సుల నుంచి మరో 47 మంది పిల్లలకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్‌లు అందిస్తానని తెలిపారు.
వారి బంగారు భవిష్యత్‌కై బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా రెండేండ్ల పాటు అత్యుత్తమ కోచింగ్ ఇప్పిస్తానని స్పష్టం చేశారు. ప్రతి రోజు గెలవాలనుకునే ఆ పిల్లల కలలను సాకారం చేసే దిశగా ముందడుగు వేయాలన్నారు కేటీఆర్. తన బర్త్ డే సందర్భంగా ప్రకటనల కోసం డబ్బులు ఖర్చు చేయకుండా.. ఎవరికి తోచిన మార్గంలో వారు అనాథ పిల్లలకు సహాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరుతున్నానని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.