అరాచ‌కం హ‌ద్దు మీరుతోంది ! కేసీఆర్..

– టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై  బీజేపీ రాముల‌మ్మ ఫైర్

హైద‌రాబాద్ః జ‌న‌గామ‌లో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసుల లాఠీజార్జ్ చేయ‌డంపై క‌మ‌ళం నేత‌లు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌… ప్ర‌‌భుత్వ, పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌న‌గామ సీఐపై 24 గంట‌ల్లో చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ చేస్తూ.. బుధ‌వారం ఛ‌‌లో జ‌న‌గామకు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండ‌గా బీజేపీ మ‌హిళా నేత, ప్ర‌ముఖ సినీ న‌టి విజ‌యశాంతి జ‌న‌గామ ఘ‌టన‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ.. కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

బీజేపీ మ‌హిళా నేత, ప్ర‌ముఖ సినీ న‌టి విజ‌యశాంతి

”అరాచ‌కం హద్దు మీరుతోంది. పోరాటాల ఖిల్లా ఉమ్మ‌డి ఓరుగ‌ల్లు జిల్లాల‌లో ఈ దుర్మార్గాల‌కు జిల్లా ప్ర‌జ‌ల ప్ర‌తిఘ‌ట‌న‌లు కూడా అంత‌కు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఇదే తీరున వ్య‌వ‌హ‌రిస్తే మీ నాయ‌కులు కూడా అక్క‌డ తిర‌గ‌లేని ప‌రిస్థితులు ఉత్ప‌న్నం కావ‌చ్చు” అంటూ విజ‌య‌శాంతి ట్వీట్ చేశారు. అలాగే, ఉద్య‌మాల‌కు ముందుండి పోరాడే నాలాంటి కార్య‌క‌ర్త‌లు బీజేపీలో అసంఖ్యాకంగా ఉన్నామ‌ని గుర్తు పెట్టుకొండి అని పేర్కొంటూ బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై లాఠీచార్జ్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.