వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ దానికోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ నుంచి రెబల్స్‌ను ఆకర్షించే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కమలం గూటికి రప్పించేందుకు ముమ్మరంగా యత్నిస్తోంది. ఈమేరకు బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ముఖ్యనేతల బృందం ఇవాళ ఖమ్మానికి వచ్చి పొంగులేటితో భేటీ కానుంది.
వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత బీజేపీలోకి రావాలని ఈటల రాజేందర్ పలుమార్లు పొంగులేటిని ఆహ్వానించినట్లు గతంలోనే ప్రచారం సాగింది. రెండు జాతీయ పార్టీల ముఖ్యనేతలు తనను సంప్రదిస్తున్నారంటూ మాజీ ఎంపీ పలుమార్లు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి రానివ్వకుండా.. కేసీఆర్‌ను సీఎం కాకుండా చేసే పార్టీలోకే వెళతానని ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని శపథం చేశారు.