తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర 5 జిల్లాల్లోని 12 నియోజకవర్గాల లో కొనసాగనుంది. 328 కిలోమీటర్ల మేర 24 రోజుల పాటు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్ర యాదాద్రి లో ప్రారంభమై వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయం వరకు కొనసాగనుంది.
అయితే తాజాగా ఈ పాదయాత్రకు విరామం ఇచ్చారు బండి సంజయ్. శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు. శనివారం జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు బండి సంజయ్. అనంతరం తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై, మునుగోడు ఉప ఎన్నికపై జేపీ నడ్డా, అమిత్ షా తో సమావేశం అయ్యే అవకాశం ఉంది.