ఢిల్లీలోని వసంత విహార్ లో నిర్మించిన బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించారు. మొదట ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ మొదట బీఆర్ఎస్ ఆఫీసులో నిర్వహించిన హోమం, యాగంలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 1:05 గంటలకు పార్టీ సెంట్రల్ ఆఫీసును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ” దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణం అని అన్నారు. సీఎం కేసీఆర్ దూర దృష్టి, పట్టుదల, బిఆర్ఎస్ పార్టీని ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాయని చెప్పారు. 9 మంది లోక్సభ ఎంపీలు, 7 రాజ్యసభ ఎంపీలు, 105 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో కీలక పార్టీగా ఎదిగింది” అని ట్వీట్ చేశారు.