కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై జిఎస్టి విధించడం బాధాకరం – మంత్రి పువ్వాడ అజయ్

-

కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించడం బాధాకరమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ రంగులు, నూలు తదితర వస్తువుల ధరలు పెరగటంతో అనేక ఇబ్బందులతో వస్త్రాలు తయారు చేస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంపై 5శాతం జిఎస్టి విధించడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, బతుకమ్మ చిరల ద్వారా ఉపాధిని పెంచి వారి రంగాన్ని ఆదుకోవడం ద్వారా ఇప్పుడిప్పుడే కుదిటపడిన తరుణంలో ఇలాంటి నిర్ణయంతో మళ్ళీ చేనేత కార్మికులు కష్టాలను ఎదుర్కొంటారని అన్నారు. దీనిపై కేంద్రం మళ్ళీ పునరాలోచించాలని, విధించిన GST ని తక్షణమే ఎత్తివేయాలని మంత్రి పువ్వాడ డిమాండ్ చేశారు. ఇప్పటికే పెరిగిన ధరలతో చేనేత రంగం కూరుకుపోయిందని, పెరిగిన చేనేత ముడిసరుకుల ధరలతో చీరకు గిట్టుబాటు లేకుండా పోయిందన్నారు.

రెండేళ్ల క్రితం కిలో రేషం ధర రూ.3 వేలు ఉంటే ప్రస్తుతం రూ.5 వేలకు పెరిగిందని, వార్పు, జరీ, అద్దకం ప్రతిదాని ధరలూ పెరిగాయన్నారు. ధరలు పెరిగినా చీరల రేటు మాత్రం ఆ స్థాయిలో పెరగలేదన్నారు. ఈ నేపథ్యంలో పన్నుల భారం మోపితే ఉన్న కొద్దిపాటి ఆదాయం కూడా కోల్పోక తప్పదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. చేనేత పరిశ్రమను కేంద్ర పాలకుల నిర్లక్ష్యంతో ఈ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థం అయ్యిందని, ఇది చాలదన్నట్లు మళ్లీ జీఎస్టీ బాదుడు మోపడం దుర్మార్గం అన్నారు. బిజెపి ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తరువాత ఒక మాట చెబుతోందని ద్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news