ఉత్తరాఖండ్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వానలతో ఆ రాష్ట్ర ప్రజల జనజీవనం అస్తవ్యస్తమైపోతోంది. మరోవైపు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడడం వల్ల రాకపోకలు నిలిచిపోతున్నాయి.
చమోలీ జిల్లాలోని పైన్గర్ గ్రామంలో శనివారం ఉదయం ఒక్కసారి కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో మూడు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 12 ఏళ్ల బాలిక గాయాలతో బయటపడింది. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడం వల్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.