ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. విజయదశమి రోజున భారత రాష్ట్రీయ సమితి పక్కా గా ఆవిర్భవిస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే జాతీయపార్టీ దిశగా కేసీఆర్ గత ఏడాదినుంచి తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. చాలాసార్లు ఢిల్లీ వెళ్లి అక్కడి మేధావులతో చర్చలు జరిపారు.
ఆర్థికవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులు, చరిత్రకారులతో చర్చించి వివిధ అంశాలమీద నోట్స్ తయారు చేసుకున్నారు. ఇటీవలే ఢిల్లీలో రెండు వందలమంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించి దేశ పరిస్థితులు, పరిపాలన పట్ల ఫీడ్ బాక్ తీసుకున్నారు. ఇప్పటి దేశంలోని వ్యవసాయ, విద్యుత్, వాణిజ్య, పారిశ్రామిక, ఉద్యోగ, సైన్స్ రంగాల పట్ల ఆయన సంపూర్ణ అవగాహనతో ఉన్నారు. ఎవరైనా అడిగితె అంకెలతో సహా వివరించే సమర్ధతను సంపాదించుకున్నారు.
రాజకీయంగా తనతో కలిసొచ్చే నాయకులతో సమావేశం అయ్యారు. నితీష్, శరద్ పవర్, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, హేమంత్ సొరేన్, లాలూ ప్రసాద్, తేజస్వి, కుమారస్వామి, దేవెగౌడ, పినరాయి విజయన్, మమతా బెనర్జీ లాంటి అగ్రనేతలతో పాటు కొందరు పాతతరం నాయకులతో కూడా సమావేశాలు నిర్వహించారు. కొందరు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ ఏ కూటమిలో లేకుండా సొంత పార్టీ పెడితేనే ప్రభావం ఉంటుందని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. ఈ లెక్కన దసరా రోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.