మరింత ముందుగానే వానాకాలం, యాసంగి నాట్లు : సీఎం కేసీఆర్

-

ఇక నుంచి యాసంగితోపాటు వానాకాలం సాగు కాలాన్ని కూడా ముందుకు జరపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. యాసంగి నాట్లు, కోతలు ఆలస్యమవడం వల్ల ప్రకృతి విపత్తులతో పంటలను నష్టపోతున్నామని.. దీన్ని నివారించేందుకు ఇదే సరైన మార్గమని అన్నారు. దీనివల్ల ఒనగూరే ప్రయోజనాలపై వ్యవసాయశాఖ సహకారంతో జిల్లా కలెక్టర్లు రైతాంగాన్ని చైతన్యపరచాలని ఆదేశించారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయంలో గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ‘ప్రాజెక్టులతో సాగునీరు సమృద్ధిగా అందుబాటులో ఉంది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు లభిస్తోంది. భూగర్భ జలాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మన రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా యాసంగి నాట్లు ఆలస్యం కావడం వల్ల కోతలు కూడా ఆలస్యమవుతున్నాయి. మార్చి 31 లోపే జరగాల్సిన కోతలు మే నెల దాటినా కొనసాగుతున్నాయి. దాంతో ఎండాకాలంలో వచ్చే అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి, తదితర పంటలు నష్టపోతున్నాం. ఈ బాధలు తప్పాలంటే నవంబరు 15-20 తేదీల్లోపు యాసంగి వరి నాట్లు వేసుకోవాలి. అందుకు అనుగుణంగా వరినాట్లను కూడా ముందుకు జరుపుకోవాలి.’ అని కేసీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news