నియోజకవర్గానికి మూడు వేల మంది చొప్పున అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆయా దశల ఫొటోలు, ఇతర మార్గాల ద్వారా నిర్ధారించుకుని, నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ.. లబ్ధిదారులకు దశలవారీగా ఆర్థికసాయం అందించాలని అన్నారు. సొంత జాగాలున్న లబ్ధిదారులకు పునాది దశలో రూ.లక్ష, స్లాబ్ దశలో మరో రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయిన ఆఖరి దశలో మరో రూ.లక్ష.. మొత్తంగా రూ.3 లక్షలు అందజేయాలని సీఎం తెలిపారు. ఇందుకు విధివిధానాలను రూపొందించి, ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించాలని సీఎస్ శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మరోవైపు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల ప్రారంభ సందర్భంగా జూన్ 2 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు సీఎం వివరించారు. ఏ కార్యక్రమాన్ని ఎంత వినూత్నంగా చేపట్టాలో వివరించారు.