బిఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్ లో జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణేతర ప్రాంతంలో తొలి సభను ఆదివారం మధ్యాహ్నం నిర్వహిస్తున్నారు. ఈ సభకు పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ కు చేరుకున్నారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. ప్రత్యేక విమానంలో నాందేడ్ కి బయలుదేరారు.
అక్కడ చారిత్రిక గురుద్వారలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఇక తొలి సభ కావడంతో సభ వేదికను సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణంతోపాటు సభస్తలికి వెళ్లే దారులన్నీ గులాబీమయమయ్యాయి. 2024 ఎన్నికలే టార్గెట్ గా సీఎం కేసీఆర్ ఈ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిపై కూడా మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.