కోవిడ్ రోగులతో ముచ్చటించిన సీఎం కేసీఆర్

-

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా దాదాపు గంటపాటు సీఎం కోవిడ్ కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసీయూ, ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్ వార్డులు సహా, పలు జనరల్ వార్డులలో కలియతిరిగారు.

ఈ సందర్భంగా సీఎం వివిధ వార్డుల్లోని బెడ్ల వద్దకు వెళ్లి పేషెంట్లతో నేరుగా మాట్లాడారు. వారికి దైర్యం చెప్పడంతో పాటు భరోసా ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స సరిగ్గా అందుతుందా లేదా అని పేషెంట్లను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో భోజన సదుపాయాలపై కూడా సీఎం కేసీఆర్ ఆరా తీసారు. ఇక రోగుల  తన దృష్టికి తీసుకొచ్చిన  సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా వైద్యాధికారులకు ఆదేశాలిచ్చారు.

నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సీజన్ ను తయారు చేసే ఆక్సీజన్ ప్లాంట్ ను ఇటీవలే గాంధీలో ప్రారంభించిన విషయం తెల్సిందే.ఈ ఆక్సిజన్ ప్లాంట్ ను సీఎం పరిశీలించారు. ప్లాంట్ మొత్తం కలియతిరిగి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు ను ప్లాంటు పనిచేసే విధానం గురించి, ఆక్సీజన్ ప్యూరిటీ గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇక గాంధీలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులతో, జూనియర్ డాక్టర్లతో సీఎం నేరుగా మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని అభినందించారు. వారికి ఎటువంటి ఇబ్బంది వున్నా పరిష్కరిస్తామని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం యువ డాక్టర్లుగా వారి మీద ఉందని అన్నారు. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రతిపాదనలను తక్షణమే పంపాలని వైద్య అధికారులను సీఎం ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news