రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ల వానలు, ఈదురుగాలుల రైతులకు కడగళ్లు మిగిల్చాయి. మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందనగా.. వడగళ్ల వానకు పంటంతా నేలమట్టమైంది. కొన్ని ప్రాంతాల్లో పంట నీటిలో తడిసిముద్దయింది. అకాల వర్షంతో రాష్ట్రంలోని రైతులు బాగా నష్టపోయారు. ఈ క్రమంలో పంట నష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం రోజున నివేదిక సమర్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా 2.80 లక్షల ఎకరాల మేరకు మొక్కజొన్న, మిర్చి, వరి, పత్తి పంటలతో పాటు కూరగాయలు, ఉద్యానవన పంటల్లో నష్టం జరిగిందని సీఎస్ ముఖ్యమంత్రికి నివేదించారు. దాదాపు 96 వేల మంది రైతులు నష్టపోయినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఆమె జిల్లా కలెక్టర్ల నుంచి పంట నష్టాలపై సమగ్ర నివేదికలు కోరారు. కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలోని వ్యవసాయాధికారులతో సర్వేలు చేయించి నివేదిక రూపొందించారు. పంటలు, రైతుల వారీగా వివరాలు అందించారు.
నివేదిక ఆధారంగా సీఎం గురువారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిసింది. భారీగా పంట నష్టం జరిగిన గీసుగొండ, దుగ్గొండి మండలాలకు ఆయన వెళ్లి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని సమాచారం. సీఎం పర్యటన నేపథ్యంలో వరంగల్ జిల్లాలో ఏర్పాట్లు ప్రారంభించారు. హెలిప్యాడ్‌లను సిద్ధం చేశారు.