గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్.. మరో 10 రోజుల్లో రైతుబంధు

నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జగిత్యాలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జగిత్యాలలో నూతనంగా నిర్మించిన టిఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు కార్యాలయం వద్ద గులాబీ జెండాను ఎగరవేశారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. నూతన టిఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను సీట్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఆ తర్వాత వైద్య కళాశాల భవనం, నూతన కలెక్టరేట్ భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్.. మోతే శివారులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులందరికీ మరో శుభవార్తని అందజేశారు. రైతులందరికీ మరో 10 రోజులలో రైతుబంధు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని.. రైతులు పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు.