తెలంగాణలో భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు రూ.11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణలో ఆగస్టు 31 నుంచి నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయని సీఎం తెలిపారు. 37 మంది ప్రాణాలు కోల్పోయారని, లక్షకుపైగా పశువులు, ఇతర మూగ జీవాలు మృతిచెందాయని, 4.15 లక్షల ఎకరాల్లో పంటతో పాటు రోడ్లు, కల్వర్టులు, కాజ్‌వేలు, చెరువులు, కుంటలు, కాలువలు దెబ్బతిన్నాయని కేంద్ర మంత్రి షా దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతు పనులను తాము వెంటనే చేపట్టామని వివరించారు. ఆయా పనులకు రూ.5,438 కోట్లు విడుదల చేయాలని సెప్టెంబరు రెండో తేదీన తాను లేఖ రాసిన విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
రాష్ట్రంలో పంట, ఇతర నష్టాలపై కేంద్ర బృందం పర్యటించి మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.11,713 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సెప్టెంబరు 30వ తేదీన నివేదిక సమర్పించిందని సీఎం తెలిపారు. ఆ నిధులు పునరుద్ధరణ, మరమ్మతుల పనులకు ఎంతమాత్రం సరిపోవని ముఖ్యమంత్రి తెలిపారు. వాటిని ఇప్పటి వరకు విడుదల చేయనందున వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని కోరారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎస్‌డీఆర్ఎఫ్ మొదటి, రెండో విడతల కింద తెలంగాణకు రూ.416.80 కోట్లను కేంద్రం విడుదల చేసిందని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలియజేశారు. పునరుద్ధరణ, మరమ్మతు పనులకు విడుదల చేసే నిధులను గతంలో ఎస్‌డీఆర్ఎఫ్ పనులకు సంబంధించిన నిధులు ఉపయోగానికి ముడిపెట్టవద్దని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఎస్‌డీఆర్ఎఫ్‌కు సంబంధించిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే వ్యయం చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.