బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి గుడిసెల వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ముగ్గురు సెక్రటేరియట్ కు రావాలని.. తాను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూర్చొని.. అధికారులందరినీ పిలిపించి మూసి ప్రక్షాళన కోసం రూపొందించిన ప్రణాళికలన్నీ వారికి వివరిస్తామని తెలిపారు. ఆ తర్వాత మూసి నిర్వాసితులకు ఎలా న్యాయం చేయాలో వాళ్లే చెప్పాలని కోరారు. నష్టపరిహారం ఇవ్వాలా..? ప్రత్యామ్నాయంగా పక్కా ఇల్లు కట్టించాలా..? లేదంటే మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలా..? పిల్లలకు మంచి పాఠశాలలు నిర్మించాలా..? ఎలాంటి ప్రత్యామ్నాయం ఇవ్వాలో వాళ్లే సూచించాలని సవాల్ విసిరారు.
లేదంటే ఇలాగే వదిలేసి మూసిని మూసేయాలి అంటారేమో కూడా చెప్పాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు సవాల్ విసురుతూ.. గుజరాత్ లో 64 వేల కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలించి సబర్మతి రివర్ ఫ్రంట్ ను నరేంద్ర మోడీ ఏర్పాటు చేసుకున్నారని అందులో కేవలం 16 వేల మందికే నష్టపరిహారం ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి గుజరాత్ మోడల్ అద్భుతం అంటూ చప్పట్లు కొట్టే ఈటెల రాజేందర్ కి మన హైదరాబాద్ మూసి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే వచ్చే కష్టమేంటి..? నష్టం ఏంటి అని ప్రశ్నించారు.