మన దేశంలో జరిగిన అనేక సామాజిక, అసమానతల రాజకీయ పోరాటాలలో యువత భాగస్వామ్యం లేని ఏ ఉద్యమం లేదు. అది దేశ విముక్తి అయినా.. తెలంగాణ రాష్ట్రం కోసం అయినా.. అనేకమంది విద్యార్థుల, ఆత్మ బలిదానాల, ప్రాణాలకు తెగించిన వారి పోరాటం వల్లనే జరిగింది. సమాజంలో గుణాత్మక విలువలు కాపాడేలా కృషి చేస్తున్నారు యువకులు. దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు దోహదపడే బలమైన మానవ వనరులు యువత. దేశాన్ని, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపే సత్తా యువతకి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.
జాతీయ రాజకీయ పార్టీలు, ప్రాంతీయ రాజకీయ పార్టీలు యువతను, విద్యావంతులను ఓటు బ్యాంకుగా, ఓట్లను సమీకరించే కార్యకర్తలుగా ఉపయోగించుకోవడం రాజకీయ పార్టీల సంప్రదాయమైంది. ఇక తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని యువత నిర్వహించాల్సిన పాత్రపై చర్చించేందుకు ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం సదస్సును నిర్వహించనున్నారు. “వచ్చే ఎన్నికల్లో తెలంగాణ యువత పాత్ర” పై ఆర్ట్స్ కళాశాలలో రూమ్ నెంబర్ 57 లో మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా మోటివేషనల్ స్పీకర్ అకెళ్ళ రాఘవేంద్ర, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, నేలంటి మధు, కోటా శ్రీనివాస్ గౌడ్, రాజ్ జనగాం హాజరై ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు.