ఇటీవల రష్యాలో అధ్యక్షుడు పుతిన్పైన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. 24 గంటల్లోనే మళ్లీ ఆ సైన్యం వెనక్కి తగ్గింది. అయితే ఈ తిరుగుబాటుతో పశ్చిమ దేశాలు రష్యాలో రక్తపాతం జరుగుతుందని ఆశపడ్డాయని పుతిన్ ఇటీవల ఆరోపించారు. అయితే తాజాగా దీనిపై అమెరికా స్పందించింది.
రష్యాపై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు రష్యా గూఢచారి చీఫ్ సెర్గీ నారిష్కిన్‌కు.. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ తెలిపారు. వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ అప్రమత్తమయ్యారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటులో పశ్చిమ దేశాల జోక్యం ఉందంటూ పుతిన్ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి బలం చేకూర్చకుండా చూడటం ముఖ్యమని బైడెన్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జర్మనీ ఛాన్స్‌లర్ షోల్జ్, బ్రిటన్ ప్రధాని సునాక్‌కు చెప్పారు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ వ్యూహాలు అమెరికాకు ముందే తెలుసన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఆ ఆరోపణలను, మీడియాకథనాలను అమెరికా తోసిపుచ్చింది.