తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నిన విషయం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి 8 మందిని అరెస్ట్ చేసినట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలను వెల్లడించారు. ఈ విషయంపై బీజేపీ ఉపాధ్యక్షురాలు మీడియాతో మాట్లాడారు. మంత్రి హత్యకు కుట్ర పన్నారని యువకులపై తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు.
ఈ కేసు వెనుక రాజకీయ, ప్రభుత్వ కుట్ర దాగి ఉందన్నారు. కొంత మంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు ఆమె విమర్శించారు. గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఈసీకి ఫిర్యాదు చేయడంతో పాటు మంత్రి అవినీతి కబ్జాలపై బాధితులు గత కొద్ది రోజులుగా ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆ ఆరోపణలను తట్టుకోలేకనే బాధితులను కిడ్నాప్ చేయించారని ఆమె అన్నారు. బాధితుల భార్య, పిల్లలు నా దగ్గరికి వస్తే మాట్లాడినట్టు డీ.కే.అరుణ వెల్లడించారు. తమ వాళ్లను ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని వెల్లడించారు. ముఖ్యంగా రాఘవేందర్ శ్రీనివాస్ గౌడ్‌పై కేసు వేశాడు. రాఘవేందర్ రాజు తమ్ముడిని కొందరూ వ్యక్తులు కిడ్నాప్ చేశారు. శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర అనేది పచ్చి అబద్దం అని డీ.కే. అరుణ పేర్కొన్నారు. ఈ కేసుపై రాష్ట్ర పోలీసుల మీద తమకు నమ్మకం లేదని.. సీఐబీతో పాటు అన్ని దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని కోరతామని డీ.కే.అరుణ మీడియా ముందు వివరించారు.