పాతబస్తీలో మెట్రోరైల నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే అధికారులు పనులు వేగవంతం చేశారు. మెట్రో రైలు అలైన్మెంట్, ప్రభావిత ఆస్తులు తదితరాలపై డ్రోన్ సర్వేని హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ(హెచ్ఎంఆర్ఎల్) ప్రారంభించింది. దారుల్షిఫా కూడలి నుంచి శాలిబండ కూడలి మధ్య ఇరుకైన మార్గం విస్తరణ, మెట్రోస్టేషన్ల నిర్మాణానికి రహదారిని విస్తరించాల్సి ఉన్న నేపథ్యంలో.. రహదారి విస్తరణకు అవసరమైన ప్రభావిత ఆస్తుల కచ్చితమైన కొలతల కోసం డ్రోన్ సర్వే ప్రారంభించామని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
తక్కువ దూరమే అయినా పాతబస్తీ మెట్రో అలైన్మెంట్ మార్గంలో 21 మసీదులు, 12 ఆలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 సమాధి యార్డులు, 6 చిల్లాలతో సహా దాదాపు 103 మతపరమైన, ఇతర సున్నిత నిర్మాణాలు మెట్రో నిర్మాణానికి సవాల్‌గా ఉన్నాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అలైన్మెంట్, స్తంభాలు నిర్మించే ప్రదేశాలు మొదలైన వాటిని మతపరమైన, సున్నిత నిర్మాణాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపని విధంగా.. డ్రోన్ సర్వే ఆధారంగా ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించారు.