తెలుగు రాష్ట్రాల మధ్య ఇవాళ్టి నుంచి వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. ఉదయం 10 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. సికింద్రాబాద్‌లోని 10వ నంబర్ ప్లాట్ ఫాం నుంచి వందే భారత్ రైలు ప్రారంభం కానుంది.
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను పర్యటించారు.
ఆధునిక సాంకేతికతతో వందేభారత్ రైలు రూపకల్పన జరిగిందని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఉభయ రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ రైలును కేంద్రం ప్రారంభిస్తోందని తెలిపారు.
వందేభారత్ రైలులో 16 బోగీలు ఉంటాయన్న అధికారులు అందులో 14 చైర్ కార్ బోగీలు, మరో రెండు ఎగ్జిక్యూటీవ్ చైర్‌కార్ బోగీలుంటాయన్నారు. మొత్తంగా రైలులో 1128 మంది ప్రయాణించవచ్చని తెలిపారు. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఈ రైలు సికింద్రాబాద్-విశాఖల మధ్య పరుగులు పెడుతుందని వివరించారు.