హైదరాబాద్‌లో 5 వేల ఏళ్ల క్రితం నాటి బొమ్మలలిపి వెలుగుచూసింది. నూతన శిలాయుగంలో ఆదిమానవులు నివసించారనడానికి ఆధారాలు దొరికాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బీఎన్నార్ హిల్స్‌లో ప్రాంగణ రాయి పైకప్పుపై బొమ్మల లిపి అక్షరాలు ఉన్నాయని రాష్ట్ర గిరిజన మ్యూజియాల సంరక్షకుడు, చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ తెలిపారు.
‘ఈ అక్షరాలు సింధు నాగరికత నాటి అక్షరాలతో పోలి ఉన్నాయి. పడగ రాయి పైకప్పునకు రెండుగజాల పొడవున తూర్పు- పడమరలుగా గొలుసుకట్టు బొమ్మలరాత ఎరుపు రంగులో లభించింది. ఈ తరహా రాతలు ఇప్పటికే మహబూబ్‌నగర్ దగ్గర్లోని మన్నెంకొండ, వర్గల్ సరస్వతీ ఆలయ పరిసరాల్లో పడగరాళ్ల పైకప్పులపై కనిపించాయి. తాజాగా బీఎన్నార్‌హిల్స్‌లోని అక్షరాలు సింధు నాగరికత అక్షరాలతో పోలి ఉన్నాయి. నిపుణులు వాటిని చదివి నిర్ధారిస్తే నాటి సంస్కృతి ఇక్కడా ఉన్నట్లు వెల్లడవుతుంది’ అని చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ వివరించారు.