హైదరాబాద్ః ఇటీవలి ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టడం.. ఇప్పటికే దూకుడుగా ప్రజల్లోకి దూసుకుపోతున్న తెలంగాణ బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. కమళం కండువ కప్పుకోవడానికి ఇతర పార్టీల నేతలు సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరగా.. తాజాగా రాష్ట్రానికి చెందిన ఓ మాజీ మంత్రి సంక్రాంతికి ముహుర్తం ఖరారు చేసుకుని కమళం గూటికి చేరబోతున్నారు.
అయనే మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత, వికారబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆగమ చంద్రశేఖర్. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవులతో పాటు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టు మంగళవారం మీడియాకు వెల్లడించారు. తన రాజీనామా లేఖను తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపినట్టు తెలిపారు. పార్టీకి ఎంతగానో సేవ చేసిన తగిన గుర్తింపును ఇవ్వడంలేదనీ, పార్టీలో నిబద్ధత కరువైందని ఆరోపించారు. క్రమశిక్షణలేని కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నానని తెలిపారు. కాగా, 1985 నుంచి 2008 వరకూ ఐదు సార్లు చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ టైంలో మూడు పార్టీలు మారారు. తాజాగా ఈ నెల 18న బీజేపీ లో చేరుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.