మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల విక్రయం కేసులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. సెప్టెంబర్ 02న మహబూబ్ నగర్ పట్టణం క్రిస్టియన్ పల్లి శివారులోని ఆదర్శనగర్ లో 523 సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూముల్లో అక్రమాలు జరిగాయని తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో నలుగురి పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.
ఈ కేసులో ఏ4 నిందితుడుగా ఉన్న శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ గౌడ్ హైదరాబాద్ లో ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆలోపే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన వాహనంలో సోదరుడిని తీసుకొచ్చి గ్రామీణ పోలీసులకు అప్పగించారు. అతని వాంగ్మూలం రికార్డు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. శ్రీకాంత్ గౌడ్ ను జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం మహబూబ్ నగర్ కోర్టుకు తరలించగా.. న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో అచ్చంపేట న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. విచారించిన న్యాయమూర్తి శ్రీకాంత్ గౌడ్ కు 14 రోజుల రిమాండ్ విదించగా.. మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలించారు.