హైదరాబాద్ మహానగరంలో అద్భుత కట్టడాలకు వేదికగా మారుతోంది. ఇప్పటికే చారిత్రక కట్టడాలతో పాటు అంబేడ్కర్ విగ్రహం, సమతామూర్తి విగ్రహం, కొత్త సచివాలయంతో నగర కీర్తి అంచెలంచెలుగా పెరిగిపోతోంది. తాజాగా నగర శివారు నార్సింగి వద్ద హరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో 400 అడుగుల ఎత్తయిన హరేకృష్ణ హెరిటేజ్ టవర్ (ఆలయం) నిర్మాణానికి రంగం సిద్ధం అవుతోంది.
ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని సంస్థ హైదరాబాద్ అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస తెలిపారు. శ్రీకృష్ణ గోసేవా మండలి విరాళంగా ఇచ్చిన ఆరెకరాల స్థలంలో రూ.200 కోట్లతో నిర్మించే ఈ కట్టడం.. నగరంలో ఒక సాంస్కృతిక మైలురాయిగా నిలవనుందన్నారు. ఆలయ మండపంలో రాధాకృష్ణులతో పాటు 8 మంది ప్రధాన గోపికల విగ్రహాలనూ ప్రతిష్ఠిస్తామన్నారు. తిరుమల తరహాలో అతిపెద్ద ప్రాకారంతో కూడిన శ్రీనివాసుడి ఆలయం కూడా ఉంటుందని వివరించారు. ‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ’ ప్రాజెక్టుగా రూపొందే ఈ హెరిటేజ్ టవర్.. కాకతీయ, చాళుక్య, ద్రవిడ చక్రవర్తుల కాలం నాటి కట్టడాల శైలిని పోలి ఉంటుందన్నారు.