హైదరాబాద్ మెట్రో మరో మైలురాయి చేరుకుంది. అత్యధిక ప్రయాణికులతో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. జూలై 3 ఒకే రోజు 5.10 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి చారిత్రక మైలురాయిని సాధించింది. నవంబరు 29, 2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోలో ఇదే అత్యధిక ప్రయాణికుల సంఖ్య. కరోనా కాలం తరువాత మెట్రోలో ప్రయాణికుల రద్దీ రోజుకు రోజుకు విపరీతంగా పెరుగుతుంది.
ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కకుండా సులభంగా, వేగంగా అందిస్తున్న మెట్రో ప్రయాణ సేవలను నగరవాసులు ఎంతో ఇష్టపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కార్యాలయాలకు వచ్చి పని చేస్తుండడంతో కారిడార్-1లో మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ మార్గంలో సోమవారం ఒక్కరోజే అత్యధికంగా 2.60 లక్షల మంది ప్రయాణించారు. ఇందులో రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచే 32 వేల మంది ప్రయాణించినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
మొత్తం మూడు కారిడార్‌లలో కలిసి 56 మెట్రో స్టేషన్‌లు ఉండగా, అందులో అత్యధికంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి 32వేల మంది ప్రయాణికులు, ఎల్‌బీనగర్ నుంచి 30వేల మంది, అమీర్‌పేట మెట్రో స్టేషన్ నుంచి 29వేల మంది, మియాపూర్ మెట్రోస్టేషన్ నుంచి 23 వేల మంది ప్రయాణం చేశారని మెట్రో అధికారులు తెలిపారు.