హైదరాబాద్‌ను వర్షం చిగురుటాకులా వణికిస్తోంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నగర వాసులు తిప్పలు పడుతున్నారు. పనులపై బయటకు వెళ్తున్న వారు వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. ఇక చెరువులను తలపిస్తున్న రహదారులపై తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల భారీ వరద చేరి ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో వానలోనే వేచి చూస్తున్నారు.
మూసాపేట మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. కూకట్‌పల్లి నాలా పొంగి ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరుతోంది. దీని వల్ల మెట్రో స్టేషన్ వద్ద వాహనాలు బారులు తీరాయి. కూకట్‌పల్లి-మూసాపేట, ఎర్రగడ్డ-మూసాపేట్ రోడ్లపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల పాటు వర్షంలోనే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు మైసమ్మగూడలో ఇంజినీరింగ్ హాస్టల్ విద్యార్థులు ఉంటున్న అపార్ట్‌మెంట్ల వద్ద భారీగా చేరిన వరదనీరు చేరింది. దాదాపు 15 అపార్ట్‌మెంట్లలో మొదటి అంతస్తుకు చేరిన వరదనీరు చేరడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వారిని కాపాడేందుకు సహాయ సిబ్బంది రంగంలోకి దిగారు. 2 జేసీబీల సాయంతో చర్యలు మొదలు పెట్టారు.