చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సోమవారం హైడ్రా కమిషనర్ మరియు లేక్ ప్రొటక్షన్ కమిటీ ఛైర్మెన్ ఏవీ రంగనాథ్ సమీక్ష నిర్వహించారు. నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ప్రజావసరాలకు నిర్దేశించిన స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా.. నిరంతరం నిఘా పెట్టేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఆక్రమణలకు ఆస్కారం లేకుండా యాప్‌ను తీసుకు రానుంది హైడ్రా.
ఎక్కడ ఆక్రమణలు జరుగుతున్నా యాప్ ద్వారా సమాచారం క్షణాల్లో హైడ్రాకు చేరేలా చర్యలు చేపట్టింది. ఈ యాప్‌లోనే ప్రజలు ఫిర్యాదు చేసే అవకాశం, క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన, చర్యల నమోదు చేస్తుంది. ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడమే కాదు.. వాటికి పూర్వవైభవం తీసుకువచ్చే పనిలో ఉన్న హైడ్రా.. ఆక్రమణలు తొలగించిన చెరువుల్లో డెబ్రీస్‌ను పూర్తి స్థాయిలో తొలగించడం చేస్తుంది. మొదటి దశగా సున్నం చెరువు, అప్పాచెరువు, ఎర్రకుంట, కూకట్‌పల్లి నల్లచెరువుతో పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.