తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. దీంతో గెలుపు కోసం అభ్యర్ధులు ప్రచారం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలోనే పెద్దపల్లిలో హ్యాట్రిక్ కొట్టాలని బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చూస్తున్నారు. దాసరి ఇప్పటివరకు రెండుసార్లు గెలిచారు. ఈసారి కూడా మనోహర్ రెడ్డి కి బిఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. కానీ పెద్దపల్లి నియోజకవర్గం లో ఒక సెంటిమెంట్ ఉంది. పెద్దపల్లిలో ఇప్పటివరకు మూడోసారి గెలిచిన నేతలే లేరని స్థానిక నేతలు అంటున్నారు.
కానీ దాసరి మనోహర్ రెడ్డి మాత్రం నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, ప్రభుత్వ పథకాలతో ఈసారి గెలిచి బిఆర్ఎస్ జండాను పెద్దపల్లిలో మూడోసారి కూడా ఎగరేస్తానని దీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుండి కాంగ్రెస్ తన అభ్యర్థిగా మాజీ ఎంల్ఏ చింతగుంట విజయ రమణారావును బరిలోకి దించడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి, విజయ రమణారావు పేరును ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇంకా అధికారం గా ప్రకటించలేదని ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు.
బిజెపి కూడా తమ అభ్యర్ధిని పోటీకి దించడానికి ప్రయత్నాలు చేస్తుంది. బిజెపి నుంచి ఎన్నారై సురేష్ రెడ్డి, ప్రదీప్ రావు ఇద్దరు పోటీపడుతున్నారు.పె ద్దపల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ నుండి దాసరి ఉష అనే మహిళా నేత పోటీ పడుతున్నారు. సొంత ప్రచార రథంతో గ్రామాలలో పర్యటిస్తున్న ఉష జోరును చూసి పార్టీ నేతలు కంగారు పడుతున్నారు. ఉష చీల్చే ఓట్లు ఎవరికి నష్టాన్ని చేకూరుస్తాయా అని ఆలోచిస్తున్నారు.
పెద్దపల్లిలో హ్యాట్రిక్ సెంటిమెంటును మనోహర్ రెడ్డి మారుస్తారా? లేక విజయ రమణారావు విజయం సాధించి కాంగ్రెస్ జెండా ఎగరేస్తారా? ఈ రెండు కాదని పెద్దపల్లిలో బిజెపి జెండా ఎగురుతుందా వేచి చూడాల్సిందే..