కరోనా దెబ్బకు ఇప్పుడు దాదాపుగా వేడుకలు అన్నీ కూడా నిషేధించే పరిస్థితి వచ్చింది అనే మాట వాస్తవం. ఇక వినాయక చవితి వేడుకలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో చాలా వరకు ఆందోళన అయితే ఉంది. అసలు వేడుకలను నిర్వహించాలా వద్దా అనేది అర్ధం కాని పరిస్థితి. ఈ నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఒక గ్రామ సంచలనం నిర్ణయం తీసుకుంది. రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో గ్రామస్తుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
కరోనా నేపథ్యంలో వినాయక చవితి పండగ నిర్వహణపై చర్చ జరిపారు. జిల్లాలో కేసులు పెరుగుతుండటంతో తలమడ్ల గ్రామంలో వినాయక మండపాలు ఏర్పాటు నిషేదమని తీర్మానం చేసారు. ఇళ్లలో తప్ప ఎక్కడ కూడా వినాయకులను ప్రతిష్టించవద్దని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఇంట్లో మట్టి వినాయకులను నెలకొల్పి సామాజిక దూరం పాటిస్తూ పూజలు చేయాలని గ్రామస్తులకు సూచించారు. రాష్ట్రంలోనే వినాయక విగ్రహ ప్రతిష్ఠ నిషేధించిన మొట్టమొదటి గ్రామంగా నిలిచింది తలమడ్ల.