టీఎస్పీఎస్సీ పేపర్ లీకులపై ఉద్యమిస్తున్న ఓయూ, కేయూ విద్యార్థులపై సర్కార్ చేపడుతున్న అణచివేత చర్యలను ఖండిస్తున్నాం అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి లాఠీ ఛార్జీలు, అరెస్టులు చేయడం మీ నిరంకుశ పాలనకు నిదర్శనం అని దుయ్యబట్టారు. నోరెత్తితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారంటే మీది రౌడీల పాలన కాకపోతే మరేంటి..! అని నిలదీశారు.
ఆనాడు మా ఉద్యోగాలు మాకే అంటూ విద్యార్థులు కొట్లాడకపోతే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు షర్మిల. వందల మంది నిరుద్యోగులు బలిదానాలు చేసుకోకపోతే రాష్ట్రం సిద్దించేదా..? ఉద్యమ సమయంలో పోటీ పరీక్షలు రాయొద్దని విద్యార్థులను రెచ్చగొట్టి, మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని మండిపడ్డారు. ఉద్యమానికి విశ్వవిద్యాలయాలు ఊపిరి అని చెప్పి ఇప్పుడు నీ రక్షణ సైన్యాన్ని పెట్టి నోరు ఎత్తుకుండా చేస్తున్న మీ పాలన రాజరికపు పాలనకు నిదర్శనం అన్నారు. 9 ఏళ్లుగా ఊరించి ఊరించి వేసిన నోటిఫికేషన్లకు మీ నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగాలు అందకపాయే.. లీకులతో ఉద్యోగాలకు లాకులు పడే. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను అంగట్లో పెడితివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోచింగ్ సెంటర్లకు లక్షలకు లక్షలు పోసి శిక్షణ తీసుకున్న నిరుద్యోగులకు భరోసా లేకపాయేనని.. నిజంగా లీకుల వెనుక మీ హస్తం లేకపోతే, మీరు సుద్ధపూస అయితే విద్యార్థులు అడుగతున్నట్లు SIT తో కాకుండా CBI తో దర్యాప్తు చేయించు.. లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు అని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు తక్షణ సహాయం 50 వేలు ప్రకటించాలన్నారు. ఇవేమీ చేతకాక..మాకేం సంబంధం అనడం..ప్రశ్నస్తే పరువు నష్టం దావాలు వెయ్యడం…SIT ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇయ్యడం,హౌజ్ అరెస్టులు చేయడం తప్పా మరొకటి చేతకాదని మండిపడ్డారు. పేపర్ లీకులపై తలదించుకొని, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి విద్యార్థులు, ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపడం నీ నియంతృత్వానికి పరాకాష్ఠ అన్నారు.