స్టేషన్ ఘన్‌పూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కడియం శ్రీహరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
కడియం శ్రీహరి బీఆర్ఎస్‌ను వీడిన తర్వాత కార్యకర్తల్లో జోష్ ఎక్కువగా కనబడుతోంది. కసి ఎక్కువగా కనబడుతోంది. స్టేషన్ ఘన్‌పూర్ ఉప ఎన్నికలో పని చేసిన ఉత్సాహం ఇవాళ మీలో కనబడుతోంది. పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనబడుతుంది. ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకుని, అందరితో సమావేశాలు పెట్టించి చివరి క్షణంలో పార్టీ మారారు. ఇలాంటి ద్రోహులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు హరీశ్‌రావు. పార్టీ మారడమంటే కార్యకర్తల మనోస్థైరాన్ని దెబ్బతీయడం, పార్టీని అవమానపరచడమేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో శ్రీహరికి ఏం తక్కువ చేయలేదు. డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, ఎంపీగా అవకాశాలు ఇచ్చింది పార్టీ.