తెలంగాణ బిజెపిలో పలు మార్పులు కావాలని కోరుకుంటున్నామన్నారు మాజీ ఎంపీ, బిజెపి నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ సంకట స్థితిలో ఉందన్నారు. ప్రజలకు నమ్మకం కలిగించేలా బిజెపి మరింతగా శ్రమించాల్సి ఉందన్నారు. ఈసారి కేసీఆర్ ను ఎదుర్కొనే రాజకీయ పార్టీకే ప్రజల మద్దతు దక్కుతుందన్నారు. తెలంగాణ బీజేపీ వ్యవహార శైలిలో అనేక రకాలుగా మార్పులు జరగవలసి ఉందన్నారు.
నాయకులకు బాధ్యతలు, బిజెపి ప్రజలకు ఇచ్చే హామీల లాంటి విషయాలలో పలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. అవన్నీ కేంద్ర నాయకత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నామని.. ఈటెల రాజేందర్ వంటి నేత క్రియాశీలకంగా లేకపోవడం వంటిది ఏమీ లేదన్నారు. ఈటెల తో పాటు భావసారుప్యత గల నాయకులంతా కలిసి మరో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తారనే వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో ప్రాంతీయ పార్టీకి అవకాశమే లేదన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు జరిగినా.. ఆ రాజకీయ వేదికను కేసీఆర్ పురిటిలోనే చంపేస్తారని అన్నారు.
కెసిఆర్ కి బిజెపి, కాంగ్రెస్ ల కంటే.. అలాంటి రాజకీయ పార్టీయే ప్రథమ శత్రువు అని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు అధికార బిఆర్ఎస్ పార్టీని ఓడించగల సామర్థ్యం ఎవరికి ఉందా..? అని చూస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లడం ఖాయమని ప్రజలు అనుకుంటున్నారని.. ఇందుకు తగ్గట్లుగానే బిజెపి రాష్ట్ర నాయకులు కూడా కవిత ఇంకో నెల రోజులలో జైలుకు వెళుతుందని చెప్పడం, అది జరగకపోవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో బిఆర్ఎస్ కి ఏదో అవగాహన, ఒప్పందాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
ఇందువల్లనే తెలంగాణలో బిజెపి ఉధృతికి బ్రేకులు పడ్డాయనే భావన కలుగుతుందన్నారు. కానీ ఓ రాజకీయ పార్టీ అయిన బిజెపికి, కవితను విచారించే దర్యాప్తు ఈడికి సంబంధం లేదన్నారు. కానీ ప్రజలు అలా అనుకోవడంలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోజూ “ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ” అని విమర్శించడం వల్ల ప్రజలకు సందిగ్ధం ఏర్పడుతుందన్నారు. ఇది తెలంగాణలో బిజెపికి అతిపెద్ద సంకటంగా మారిందన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. అందుకే జూపల్లి, పొంగులేటి లాంటి నాయకుల చేరికలు ఆగిపోయాయన్నారు.