కృష్ణా జలాల నీటి వాటాపై ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు ఓ ఉమ్మడి నిర్ణయానికి రాలేకపోయాయి. కృష్ణానదీ యాజమాన్య బోర్డు 17వ సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. ఛైర్మన్ శివనందన్ కుమార్ నేతృత్వంలో జరిగిన భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అధికారులు, ఇతర సభ్యులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
కృష్ణా జలాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు వాటాపై భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. తొమ్మిదేళ్లుగా ఉన్న 66:34 నిష్పత్తిని కొనసాగించాలని ఏపీ కోరింది. ఆ నిష్పత్తికి ప్రాతిపదిక ఉందని వాదించింది. ట్రైబ్యునల్ తప్ప కేటాయింపులు మార్చే అధికారం ఎవరికీ లేదని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. తమకు ఈ నిష్పత్తి ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదన్న తెలంగాణ.. తాత్కాలిక కేటాయింపును గతేడాది వ్యతిరేకించినట్లు తెలిపింది. అయితే ఎప్పటికప్పుడు అవసరాల ఆధారంగా త్రిసభ్య కమిటీ ద్వారా నీటి విడుదల ఉత్తర్వులు విడుదల చేస్తూ.. వాటా తేల్చే అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది.